24 గంటల్లో 12 మంది కోవిడ్‌కు బలి: కేంద్ర ఆరోగ్య శాఖ

గత 24 గంటల్లో భారత్‌లో కోవిడ్ బారిన పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 328 కరోనా కేసులు పెరిగాయన్నారు. ఒక రోజులో ఇంత మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడం భారత్‌లో ఇదే తొలిసారి. భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 900కు చేరడానికి నాలుగు వారాలు సమయం పట్టగా.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.ఢిల్లీలో తబ్లీగ్ జమాత్‌కు చెందిన 9 వేల మందికిపైగా సభ్యులను, వారిని కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్‌కు తరలించామని కేంద్రం తెలిపింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటి వరకూ 218 మంది కరోనా బారిన పడగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మర్కజ్ నిజాముద్దీన్‌కు వెళ్లొచ్చిన వారు.